విగ్రహాల ధ్వంసం ”వదంతులు – వాస్తవాలు”

1) విశాఖపట్నం జిల్లా గోలుగొండ మండలంలోని ఏటిగైరంపేట ఆలయం ఘటన
వదంతి:
విశాఖపట్నం జిల్లాలోని గోలుగొండ మండలంలోని ఏటిగైరంపేట వద్ద ఉన్న ఒక ఆలయం నుండి గణేశుడి విగ్రహం చేతులు తొలగించినట్లు 6.1.2021 న (బుధవారం) సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు వదంతులను వైరల్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా ప్రచారంలోకి తీసుకువచ్చారు.
వాస్తవం:
ఏటిగైరంపేట ఆలయంలోని గణేషుడి విగ్రహంకు వున్న చేతులు కాలక్రమంలో శిధిలమయ్యాయి. విగ్రహం నుంచి వేరైన చేతులను అర్చకులు ఆలయంలోని ఒక అల్మారాలో భద్రపరిచారు. ఆరు నెలల కిందట కొత్త అర్చకుడు ఈ ఆలయంలో చేరారు. ఆయన బుధవారం ఆలయంలోని అల్మారాను తొలిసారి తెరిచి చూసిన సందర్భంలో గణేషుడి విగ్రహానికి సంబంధించిన చేతులు కనిపించాయి. కంగారు పడిన అర్చకుడు వెంటనే అందుబాటులో వున్న భక్తులను పిలిచి ఈ దృశ్యాలను చూపించారు. ఈ సందర్బంగా అక్కడ వున్న కొందరు యువకులు ఈ దృశ్యాలను ఫోటోలు, వీడియోలుగా చిత్రీకరించారు. తరువాత వాటిని సోషల్ మీడియాలోని కొందరు స్నేహితులకు పంపించారు.
పోలీస్ దర్యాప్తు:
సోషల్ మీడియాలో గణేషుడి విగ్రహ చేతి భాగాల ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో వెంటనే విశాఖ రూరల్ ఎస్‌పి బి.కృష్ణారావు స్వయంగా సంఘటనా స్థలంకు వెళ్ళి దర్యాప్తు చేశారు. గణేషుడి విగ్రహం చేతులను ఎవరూ ధ్వంసం చేయలేదని, గతంలో విరిగిపోయిన చేతి భాగాలను గత అర్చకులు అల్మారాలో భద్రపరిచారని, దానిని తొలిసారి చూసిన కొత్త అర్చకుడు దాని గురించి తెలియకపోవడం వల్ల ఆందోళనకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. రామతీర్థం విగ్రహ ధ్వంసం ఘటన ప్రజల్లో చర్చగా వున్న నేపథ్యంలో కొందరు ఉద్దేశపూర్వకంగా గణేషుడి విగ్రహం అంశాన్ని సోషల్ మీడియాలో సంచలనం కలిగించేలా వైరల్ చేసినట్లు నిర్ధారించారు. దీనికి బాధ్యులైన తెలుగుదేశం పార్టీ మాజీ వార్డు సభ్యుడి కుమారుడు కిల్లాడి నరేష్ తో సహా ముగ్గురు యువకులపై ఐపిసి సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేసి, వారిని అరెస్ట్ చేశారు.

2) ప్రకాశం జిల్లా సింగరాయకొండ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఘటన
వదంతి:
ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యొక్క ముఖ ద్వారంపై ఉన్న లక్ష్మి నరసింహ స్వామి విగ్రహ రూపం, అమ్మవారి విగ్రహ రూపాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారంటూ సోషల్ మీడియా, కొన్ని టెలివిజన్ లలో విస్తృతంగా ప్రచారం జరిగింది. స్థానికుడు చేసిన అసత్య ప్రచారంను కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం, దానికి మద్దతుగా కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ అసత్యాలను ప్రసారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి.
వాస్తవం:
సింగరాయకొండ పట్టణంకు రెండు కిలోమీటర్ల దూరంలో సుమారు 20 సంవత్సరాల క్రితం సిమెంట్ తో ఆలయ ఆర్చీ నిర్మాణం జరిగింది. ఆ ఆర్చి పై శ్రీలక్ష్మి నరసింహ స్వామి, అమ్మవారి విగ్రహ రూపంలో బొమ్మలను సిమెంటుతో ఏర్పాటు చేశారు. అ బొమ్మలు పాతవి అయిన కారణంగా తరచూ సిమెంటు పెచ్చులు ఊడిపోయి లక్ష్మీ నరసింహ స్వామి, అమ్మవారి విగ్రహాల చేతి భాగాలు విరిగి పోయాయి. ఎప్పటికప్పుడు ఆలయ అధికారులు ప్రతి సంవత్సరం విగ్రహాలకు మరమ్మత్తులు చేసి, పెయింటింగ్ చేస్తూ వస్తున్నారు. ఈ ఆర్చీకి పూర్తిస్థాయి మరమ్మతులు నిర్వహించాలని కూడా ఆలయ అధికారులు అనుకున్నారు. కరోనా కారణంగా గత ఏడాది ఆర్చీకి పేయింటింగ్, విగ్రహాల మరమ్మతు పనులు చేయించలేక పోయారు. దీనిపై కొందరు వ్యక్తులు దురుద్దేశంతో 05.01.2021 న ఆర్చీలోని విగ్రహాలు ధ్వంసం చేశారంటూ సోషల్ మీడియా, టివి ఛానెల్స్ లో తప్పుడు ప్రచారం చేశారు.
పోలీస్ దర్యాప్తు
సింగరాయకొండ ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు జరిపారు. ఆర్చీ పైభాగంలోని విగ్రహాలను ఎవరూ ధ్వంసం చేయలేదని, సిమెంట్ పెచ్చులు ఊడిపోవడం, సకాలంలో మరమ్మతులు చేయపోవడం వల్ల విగ్రహాల చేతి భాగాలు దెబ్బతిని కనిపిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ అంశాన్ని అసత్యాలతో సోషల్ మీడియా, టివి ఛానెల్స్ లో ప్రచారం చేసిన మద్దాసాని మౌలాలి (లారీ డ్రైవర్), అంబటి శివకుమార్ (బహుజన మీడియా–సింగరాయకొండ), సాగి శ్రీనివాసరావు (ధర్మ వ్యూహం న్యూస్ పేపర్– సింగరాయకొండ), పోకూరి కిరణ్ (ABN – ఆంధ్రజ్యోతి రిపోర్టర్), ఎస్ కె భాషు (NTV రిపోర్టర్), కాట్రగడ్డ రామ్మోహన్ (HMTV రిపోర్టర్) లపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వీరిపై
Cr.No.2/2021 u/s 120(B),153(A), 295(A), 504 r/w 34 IPC సెక్షన్ ల కింద సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో 05.01.2021 న కేసు నమెదు చేశారు. అలాగే సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని నిజాలను మభ్యపెట్టి కావాలని దురుద్దేశంతో కుట్రతో పోస్టులు పెట్టిన వ్యక్తులు, వారితో పాటు టెలివిజన్ లో తప్పుడు కథనాలను ప్రసారం చేసిన ఎబిఎన్, TV 5, ETV ప్రతినిధులు, కొన్ని యు ట్యూబ్ ఛానల్స్ నిర్వహాకులపై కూడా 06.01.2021 న సింగరాయకొండ పోలీస్ స్టేషన్ Cr.No.4/2021 u/s 120(b), 153(A), 295(A) 504 r/w 34 IPC and section 16 of cable network act క్రింద కేసులు నమోదు చేశారు.

3) కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జలగూడెం ఆంజనేయస్వామి ఆలయం
వదంతి:
కర్నూలు జిల్లా కోసిగి మండలం సజ్జల గూడెం గ్రామ పరిధిలోని ఆంజనేయస్వామి గుడి ఆలయ ప్రాకారం పై ఉన్న సిమెంటుతో చేసిన దేవతా విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
వాస్తవం:
సజ్జలగుడ్డం సమీపంలోని శ్రీమార్లబండ ఆంజనేయ స్వామి ఆలయం ముఖద్వారంపై సిమెంట్ తో చేసిన విగ్రహాలు వున్నాయి. గత నెల (డిసెంబర్) 30వ తేదీన ఆలయ పరిధిలో జాతర జరిగింది. దీనిలో భాగంగా ఆలయానికి రంగులు వేసి, విద్యుత్ దీపాలతో అలంకరించారు. జాతర ముగిసిన తరువాత ఈ నెల 1వ తేదీన ఎలక్ట్రీషియన్ చిదానందం ఆలయానికి అలంకరించిన విద్యుత్ దీపాలను తొలగిస్తూ ఆలయం పై నుంచి పట్టుతప్పి కిందపడిపోయాడు. ఈ క్రమంలో ముఖద్వారం వద్ద వున్న విగ్రహాలను పట్టుకోవడంతో అవి పాక్షికంగా పెచ్చులు వూడిపోయాయి. ఈ ఘటనలో ఎలక్ట్రీషియన్ కు గాయాలు కూడా అయ్యాయి.
పోలీసుల దర్యాప్తు :
ఆంజనేయస్వామి ఆలయం పరిధిలో సిమెంట్ విగ్రహాలు ధ్వంసం చేశారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే స్పందించిన కర్నూలు పోలీసులు సంఘటనా స్థలంలో విచారణ నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగా ఎవరూ విగ్రహాలను ధ్వంసం చేయలేదని నిర్ధారించారు. దీనిని కుట్రపూరితంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై పరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
